వేటకు సన్నద్ధం | - | Sakshi
Sakshi News home page

వేటకు సన్నద్ధం

Jun 12 2026 7:31 AM | Updated on Jun 12 2026 7:31 AM

● 14 అర్ధరాత్రి నుంచి సముద్రంలో మత్స్యవేట ● సిద్ధమవుతున్న మత్స్యకారులు

మహారాణిపేట: మత్స్య సంపద సంరక్షణ, పునరుత్పత్తి కోసం ఏటా అమలు చేసే 61 రోజుల సముద్ర వేట నిషేధ కాలం ముగియడంతో ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి మళ్లీ వేట ప్రారంభం కానుంది. దీంతో విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో సందడి నెలకొంది. అయితే కొందరు మత్స్యకారులు ఎదురు అమావాస్య సెంటిమెంట్‌ కారణంగా జూన్‌ 17 నుంచి బోట్లను సముద్రంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు. వేట పునఃప్రారంభం కానుండడంతో మత్స్యకారులు తమ బోట్లకు ఐస్‌ సమకూర్చుకోవడం, ఇంజిన్‌ గేర్‌ బాక్సులు, వాటర్‌ కేబిన్లు, పంఖాలు, బుష్‌లు, వలలకు మరమ్మతులు చేయించుకుని సిద్ధం చేసుకుంటున్నారు. 9న హార్బర్‌లోని గంగమ్మ తల్లి ఆలయంలో మత్స్యకార సంఘాల ఆధ్వర్యంలో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించి, కొత్త సీజన్‌కు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు.

జిల్లా పరిధిలోని 32 కిలోమీటర్ల తీరప్రాంతం, 18 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలపై ఆధారపడి సుమారు 1.15 లక్షల మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 2,547 పడవలు ఉండగా, అందులో 680 మరపడవలు (మెకనైజ్డ్‌ బోట్లు), 1,208 మోటారు పడవలు, 350 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఈ తూర్పు తీరంలో వేటపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ మత్స్యకారులు రెండు పద్ధతుల్లో వేట సాగిస్తుంటారు. 10 నుండి 15 రోజుల పాటు సాగే దీర్ఘకాలిక వేటకు 3 వేల లీటర్ల డీజిల్‌, 10 టన్నుల ఐస్‌, సిబ్బంది ఆహార ఖర్చులతో కలిపి సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అలాగే 4 నుంచి 6 రోజులు సాగే స్వల్పకాలిక వేటకు ఇందులో సగం వరకు ఖర్చవుతుండగా, సంప్రదాయ పడవల వారు రోజువారీ వేట సాగిస్తుంటారు. వేటకు వెళ్లే ప్రతి మరపడవలోనూ లైఫ్‌ జాకెట్లు, లైఫ్‌ బాయ్‌లు, ట్రాన్స్‌పాండర్లు, జీపీఎస్‌లు తప్పనిసరిగా అమర్చుకుని ఆన్‌లో ఉంచాలని, వాతావరణ పరిస్థితులను గమనిస్తూ భద్రతా ప్రమాణాలతో వేట సాగించాలని మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement