ఆనందపురం: రెండు రోజులుగా కనిపించకుండా పోయిన గుడిలోవ ఆలయ అర్చకుడు కోట్రా కామేశ్వరరావు శర్మ (70) గురువారం ఉదయం అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించారు. ఆలయ సమీపంలో ఆయన మృతదేహాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. శొంఠ్యాం గ్రామానికి చెందిన కామేశ్వరరావు శర్మ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఆనందపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరణానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భీమిలి సీహెచ్‌సీ మార్చురీకి తరలించారు.


