వ్యాపారులపై సివిల్ సప్లయిస్
అధికారుల దాడులు
వాణిజ్య అవసరాలకు
గృహ గ్యాస్ సిలిండర్ల వినియోగం
హోటళ్లు, రెస్టారెంట్లపై
6A కేసుల నమోదు
మహారాణిపేట: గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నారనే సమాచారం మేరకు సివిల్ సప్లయిస్ అధికారులు గురువారం నగరంలో మెరుపు దాడులు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ జి.విద్యాధరి ఆదేశాల మేరకు డీఎస్‌వో వి.భాస్కరరావు ఆధ్వర్యంలో నగరంలోని వివిధ హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. తనిఖీలలో పలుచోట్ల హోటళ్లు, రెస్టారెంట్లు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారుల వద్ద నుంచి మొత్తం 34 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యాపారులపై 6 అ కేసులు నమోదు చేసినట్లు డీఎస్‌వో భాస్కరరావు తెలిపారు. గృహ అవసరాలకు కేటాయించిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం చట్టవిరుద్ధమని ఆయన హెచ్చరించారు. తమ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ దుర్వినియోగం జరిగినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవసరమైతే మరిన్ని హోటళ్లు, వాణిజ్య సంస్థలపై కూడా దాడులు నిర్వహిస్తామని తెలిపారు. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్, 1955 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హెల్ప్‌లైన్ నంబర్లు:
హెచ్‌పీసీఎల్ (హెచ్‌పీ) హెల్ప్‌లైన్:
1800 233 3555
బీపీసీఎల్ (భారత్) హెల్ప్‌లైన్:
1800 224 344
ఐఓసీఎల్ (ఇండియన్) హెల్ప్‌లైన్:
1800 233 3555
కలెక్టర్ కార్యాలయం కంట్రోల్ రూమ్:
0891-2590102


