2025–26 సంవత్సరానికి సంబంధించిన డ్రెడ్జింగ్ పనులు ఈ నెల 10వ తేదీన అధికారికంగా ప్రారంభమయ్యాయి. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ)కు చెందిన అత్యాధునిక నౌక ‘డ్రెడ్జ్ 21’ ఇప్పుడు విశాఖ సముద్ర తీరంలో తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్రతి సంవత్సరం సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను సముద్రం నుంచి వెలికితీసి, పైపుల ద్వారా తీరానికి పంపింగ్ చేయనుంది. వాతావరణం అనుకూలించే 45 పనిదినాల్లోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇలా పంపింగ్ చేసిన ఇసుక తీరం వెంబడి ఒక రక్షణ కవచంలా ఏర్పడి, అలల తాకిడి నేరుగా భూమిపై పడకుండా అడ్డుకుంటుంది.


