జిల్లాలో తగ్గుతున్న డొమెస్టిక్ గ్యాస్ సరఫరా
బుకింగ్ చేసినా వారం వేచి చూడాల్సిందే..
ప్రస్తుతం ఉన్న నిల్వలు 15 రోజుల వరకే..
ఈలోపు పరిస్థితులు సద్దుమణగకపోతే ఇబ్బందులే..
సాక్షి, విశాఖపట్నం : సరిహద్దుల్లో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ.. ఆ ప్రభావం ఇప్పుడు సాధారణ ప్రజల వంటింటిపై పడుతోంది. జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా రోజురోజుకీ తగ్గుతూ ఉండటంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. బుకింగ్ చేసిన 24 గంటల్లో రావాల్సిన సిలిండర్ కోసం ఇప్పుడు నాలుగు రోజుల నుంచి వారం రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రోజువారీ సరఫరాలో భారీ కోత
విశాఖ జిల్లాలో మొత్తం 62 గ్యాస్ ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. వీటి పరిధిలో సుమారు 8.90 లక్షల గృహ కనెక్షన్లు ఉన్నాయి. సాధారణంగా రోజుకు 25 వేల నుంచి 28 వేల వరకు సిలిండర్లు వినియోగదారులకు డెలివరీ అవుతాయి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సరఫరా తగ్గిపోవడంతో రోజుకు కేవలం 15 వేల నుంచి 18 వేల సిలిండర్లు మాత్రమే పంపిణీ అవుతున్నాయి. అంటే మొత్తం సరఫరాలో 30 నుంచి 40 శాతం వరకు కోత పడినట్లు తెలుస్తోంది.
ముందస్తు బుకింగ్‌లతో పెరిగిన ఒత్తిడి
అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమవుతాయనే భయంతో చాలామంది వినియోగదారులు ముందుగానే గ్యాస్ బుకింగ్‌లు చేస్తున్నారు. ఇదే సమయంలో బాట్లింగ్ ప్లాంట్ల వద్ద లోడింగ్ ప్రక్రియ నెమ్మదించడంతో ఏజెన్సీలకు సిలిండర్ స్టాక్ చేరడంలో ఆలస్యం అవుతోంది. దీంతో వెయిటింగ్ లిస్ట్ రోజురోజుకీ పెరుగుతూ, వినియోగదారులు సిలిండర్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
బ్లాక్ మార్కెట్ దందా?
సంక్షోభ పరిస్థితిని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అవకాశంగా మార్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుకింగ్ కోసం కాల్స్ చేస్తున్నా స్పందించడం లేదు. వినియోగదారులు నేరుగా ఏజెన్సీకి వస్తే అక్కడ సిబ్బంది స్టాక్ లేదనీ.. వచ్చినప్పుడు రావాలంటూ పంపించేస్తున్నారు. బ్లాక్‌లో అయినా ఇవ్వాలని అడిగితే.. పక్కకు పిలిచి రెట్టింపు ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖ సిబ్బంది మాత్రం తమకేం సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిల్వలు ఇంకా ఎంతకాలం?
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతం జిల్లాలోని బాట్లింగ్ ప్లాంట్లు, ఏజెన్సీల వద్ద ఉన్న గ్యాస్ నిల్వలు సుమారు 10 నుంచి 15 రోజుల వరకు సరిపోతాయి. యుద్ధ పరిస్థితులు మరింత కాలం కొనసాగితే మాత్రం సరఫరాలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం హామీ.. ప్రజల్లో మాత్రం భయం
కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు సరిపడా గ్యాస్ సరఫరా జరుగుతుందని భరోసా ఇస్తున్నప్పటికీ ప్రజల్లో మాత్రం భయాందోళనలు తగ్గడం లేదు. పరిస్థితి త్వరగా సద్దుమణగకపోతే వంటింట్లో గ్యాస్ కొరత మరింత తీవ్రం అయ్యే అవకాశముందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


