బీచ్ కోత నివారణ పనులు ప్రారంభం రూ. 82.98 కోట్లతో మూడేళ్ల ప్రాజెక్టు రంగంలోకి దిగిన ‘డ్రెడ్జ్ 21’ నౌక
విశాఖ సిటీ: విశాఖపట్నం అంటేనే నీలి సముద్రం.. అలల సవ్వడి.. పర్యాటకుల కోలాహలం. అయితే గత కొంతకాలంగా ప్రకృతి కన్నుకుట్టినట్లుగా సాగర తీరం కోతకు గురవుతోంది. అలల ఉధృతికి భూమి కరిగిపోతూ, ఆర్కే బీచ్ రోడ్డు మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఈ తరుణంలో విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (వీపీఏ) ఒక భగీరథ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సముద్రపు కోతను అడ్డుకుని, తీరాన్ని తిరిగి పూర్వ వైభవానికి తీసుకువచ్చేందుకు రూ. 82.98 కోట్ల భారీ వ్యయంతో ‘బీచ్ నరిష్మెంట్’ పనులను ప్రారంభించింది.
ప్రకృతి వైపరీత్యాలకు విరుగుడుగా
’నరిష్మెంట్’
ఏటా వర్షాకాలం, తుపానుల సమయంలో విశాఖ తీరం భారీగా కోతకు గురవుతోంది. దీనిని అరికట్టేందుకు వీపీఏ శాసీ్త్రయ మార్గాన్ని ఎంచుకుంది. సముద్రపు లోపలి భాగంలో పేరుకుపోయిన ఇసుకను తిరిగి తీరానికి చేర్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 2025–26 నుంచి 2027–28 వరకు మూడేళ్ల పాటు ఈ పనులు సాగనున్నాయి. కేవలం ఇసుకను పోయడమే కాకుండా, న్యూ సాండ్ ట్రాప్, అప్రోచెస్, ఓహెచ్‌టీబీ, ఓబీ–1, ఓబీ–2 వంటి కీలక ప్రాంతాల్లో వార్షిక నిర్వహణ డ్రెడ్జింగ్‌ను చేపట్టనున్నారు. దీనివల్ల నౌకల రాకపోకలకు మార్గం సుగమం కావడంతో పాటు, వెలికితీసిన ఇసుక తీరానికి రక్షణగా మారుతుంది.
పర్యాటకానికి భరోసా
విశాఖ బీచ్ పరిరక్షణ తమ ప్రథమ ప్రాధాన్యతని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ, డీసీఐ చైర్‌పర్సన్ డాక్టర్ ఎం.అంగముత్తు స్పష్టం చేశారు. ఆర్‌కే బీచ్ వద్ద తీర క్షీణతను నియంత్రించేందుకు ఔటర్ హార్బర్‌లోని సాండ్ ట్రాప్‌లో లభించే ఇసుకను క్రమం తప్పకుండా తీరానికి తరలించే ‘బీచ్ నరిష్మెంట్’ కార్యక్రమాన్ని ఏటా చేపడుతున్నామని వివరించారు. ఈ పనులను రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ అందాలను కాపాడటమే కాకుండా, సముద్రపు కోత వల్ల తీర ప్రాంత ప్రజలకు లేదా మౌలిక సదుపాయాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు దోహదపడతాయని పేర్కొన్నారు.
పర్యాటకానికి ప్రాణం.. తీరానికి బలం
విశాఖపట్నం తీరం గత కొంతకాలంగా సముద్రపు కోతకు గురవుతుండటం పట్ల పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ చర్యలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ డ్రెడ్జింగ్ పనుల ద్వారా తీరం వెంబడి ఇసుక మేటలు పెరగడం వల్ల బీచ్ మరింత విశాలంగా మారి పర్యాటకులకు అనుకూలంగా మారుతుంది. ఆధునిక సాంకేతికతతో కూడిన ‘డ్రెడ్జ్ 21’ నౌక వినియోగం వల్ల ఈ ప్రక్రియ వేగంగా, సమర్థవంతంగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.


