జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
బీచ్‌రోడ్డు: దేశంలోనే విశాఖపట్నాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్ 2025–26’లో ప్రతి అధికారి అంకితభావంతో పనిచేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశించారు. గురువారం సిరిపురంలోని వీఎంఆర్డీఏ చిల్డ్రన్ థియేటర్‌లో జీవీఎంసీ ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాటించాల్సిన పారామీటర్లు, ప్రత్యేక కార్యాచరణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అగ్రస్థానం సాధించాలంటే అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. త్వరలో స్వచ్ఛ సర్వేక్షణ్ బృందం విశాఖను సందర్శించనున్న నేపథ్యంలో, అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటింటికీ వెళ్లి వ్యర్థాల సేకరణ, తడి పొడి చెత్త విభజన, పౌరుల ఫీడ్‌బ్యాక్, ఎన్జీవోల సహకారం, సీఅండ్‌డీ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించాలన్నారు. పింక్ టాయిలెట్స్, ప్రజా, పాఠశాల మరుగుదొడ్లు, గ్రీన్ బెల్ట్, ఆర్‌ఆర్‌ఆర్ సెంటర్ల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. బహిరంగ మల, మూత్ర విసర్జన లేని నగరంగా తీర్చిదిద్దే బాధ్యత సచివాలయ కార్యదర్శుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరిపై ఉందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మొత్తం 12,500 మార్కులు ఉంటాయని, చిన్న పొరపాటు జరిగినా మార్కులు తగ్గడమే కాకుండా నెగటివ్ మార్కులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
నంబర్ 1 స్థానమే లక్ష్యం కావాలి
విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. గతంలో విశాఖ నగరం సింగిల్ డిజిట్ ర్యాంకులతో రాణిస్తోందని, ఈసారి కచ్చితంగా ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకోవడమే మన ధ్యేయమని కమిషనర్ పునరుద్ఘాటించారు. సమావేశంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్.ఎస్.వర్మ, పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీర్ సత్యనారాయణ, సీసీపీ ప్రభాకర్ రావు, ప్రధాన వైద్యాధికారి ఈఎన్‌వీ నరేష్‌కుమార్, ఇతర విభాగాల అధిపతులు, జోనల్ కమిషనర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


