ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
జనవరి 27 నుంచి ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 23 నుంచి థియరీ పరీక్షలు హాజరుకానున్న 81 వేలమంది ఏర్పాట్లపై కలెక్టర్ హరేందిర ప్రసాద్ సమీక్ష
మహారాణిపేట: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ , థియరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షల ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, పటిష్ట బందోబస్తుతో పాటు ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్‌ను, సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించాలని సూచించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని కేంద్రాల వద్ద తాగునీరు, నిరంతర విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్, వైద్య శిబిరాలను సిద్ధం చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకోవడానికి అదనపు బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది మొత్తం 81,001 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 40,165 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 40,836 మంది ఉన్నా రు. థియరీ పరీక్షల కోసం 85 కేంద్రాలను, ప్రాక్టికల్స్ కోసం 138 కేంద్రాలను కేటాయించారు. షెడ్యూల్ ప్రకారం ఒకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి, సాధారణ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. వీటితో పాటు ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష జనవరి 21న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతాయని కలెక్టర్ వివరించారు. సమావేశంలో జేసీ విద్యాధరి, ఆర్.ఐ.వో. మురళీధర్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్. ప్రేమకుమార్, ఎస్.ఎస్.ఎ. పీవో చంద్రశేఖర్, డీవీఈవో, ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, రెవెన్యూ, పోస్టల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.


