సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయ అధికారులపై చర్యలు
సాక్షి, విశాఖపట్నం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు 2021 జూలైలో ఏసీబీ అధికారులు సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 20,829 మీ–సేవా దరఖాస్తులను ఎలాంటి కారణం లేకుండా తిరస్కరించడం, 19 దరఖాస్తులను గడువు ముగిసినా పెండింగ్‌లో ఉంచడం వంటి అక్రమాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, నో ఎర్నింగ్ సర్టిఫికెట్ల జారీ కోసం దరఖాస్తుదారుల నుంచి లంచాలు డిమాండ్ చేశారని, నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన అటెండెన్స్, డిస్ట్రిబ్యూషన్ వంటి కీలక రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించలేదని అభియోగాలు నమోదయ్యాయి. తనిఖీలు జరిగిన సమయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ కుంచే జ్ఞానవేణి, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ మొహిద్దీన్ జిలానీ, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చెక్కా రవికృష్ణపై ఏపీ ప్రభుత్వం సంయుక్త క్రమశిక్షణ చర్యలకు ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనిఖీ సమయంలో అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైనట్లు నిర్థారణ కావడంతో, ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం వీరిపై విచారణ చేపట్టి 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా మెమోలు జారీ చేసింది.


