పెల్లుబికిన జనాగ్రహం
పెదగంట్యాడ: భరించలేని వాసన.. ముక్కుపుటాలదిరిపోయేలా దుర్వాసన.. అన్నం తినలేని పరిస్థితి.. తిన్న వెంటనే వాంతులు చేసుకునే దుస్థితి.. ఈ పరిస్థితుల్లో స్థానికుల్లో ఆగ్రహం పెల్లుబికింది.. కట్టలు తెగిన కోపంతో వారంతా డంపింగ్ యార్డ్‌కు తాళాలు వేశారు.. ఆపై అక్కడే ఆందోళనకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. ఉద్రిక్తత చోటు చేసుకుంది.. దీనిపై సమాచారం అందుకున్న వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–6 జోనల్ కమిషనర్ శేషాద్రి అక్కడకు చేరుకున్నారు.. ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.. గురువారం నాటికి చెత్తను తరలిస్తామని హామీ ఇవ్వడంతో సర్దుమణిగిన వివాదం.. వివరాల్లోకెళ్తే.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని రామచంద్రనగర్‌కు ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్‌లో చెత్త కుప్పలు కొండలా పేరుకుపోయాయి. ఏ రోజు కారోజు చెత్తను తరలించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.. దీంతో నిత్యం దుర్వాసన వెదజల్లుతుండడంతో స్థానికులు సతమతవుతున్నారు.. భరించలేని దుర్గంధం రావడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి.. అన్నం కూడా తినలేక.. రోగాలతో సతమతమవుతున్నారు.. ఈ దుస్థితిపై పలుమార్లు ఆందోళనలు చేశారు.. ఆపై ప్రజాప్రతినిధులు, అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం మానేశారు.. దీంతో డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల ప్రజలు సోమవారం ఉదయం డంపింగ్ యార్డ్ వద్దకు చేరుకున్నారు.. ప్రధాన గేటుకు తాళాలు వేశారు.. సేకరించిన చెత్త తీసుకువచ్చిన వాహనాలను అడ్డుకున్నారు.. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.. ఆందోళనకారులు నినాదాలతో హోరెత్తించారు. వెంటనే డంపింగ్ యార్డ్‌ను తరలించాలని డిమాండ్ చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు, జీవీఎంసీ జోన్–6 జోనల్ కమిషనర్ శేషాద్రి అక్కడకు చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చించారు. వారంతా ససేమిరా అనడంతో మూడు రోజుల్లో చెత్తను ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఇక్కడ చెత్త నిల్వ ఉండకుండా ప్రతి రోజూ తరలిస్తామని చెప్పడంతో వారంతా శాంతించారు. ఈ నేపథ్యంలో స్థానికుల్లో ఆగ్రహవ పెల్లుబికడంతో జీవీఎంసీ అధికారులు స్పందించారు. అప్పటి కప్పుడు వాహనాలను ఏర్పాటు చేశారు. ఆ వాహనాల ద్వారా చెత్త తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
పెల్లుబికిన జనాగ్రహం


