బీచ్ రోడ్డులో ‘వందేమాతరం 150’ వేడుకలు
నేవీ బ్యాండ్ సంగీత విభావరికి విశేష స్పందన
ఏయూక్యాంపస్: భారత స్వాతంత్య్ర పోరాటంలో ప్రజలను ఏకం చేసి, ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ‘వందేమాతరం’ గేయం ఆలపించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విశాఖ బీచ్ రోడ్డులో భారత నావికాదళం ఆధ్వర్యంలో సోమవారం ‘వందేమాతరం 150’ కార్యక్రమం ఘనంగా జరిగింది. కురుసుర సబ్‌మైరెన్ మ్యూజియం పక్కన ఉన్న మైదానంలో నిర్వహించిన ఈ నేవీ బ్యాండ్ ప్రదర్శన నగరవాసులను మంత్రముగ్ధులను చేసింది. నావికాదళ సంగీత కళాకారుల బృందం వివిధ సినిమాలలోని దేశభక్తి గీతాలను అత్యంత హృద్యంగా ఆలపించారు. ముఖ్యంగా ఫైటర్, బోర్డర్ సినిమాలలోని గీతాలు ప్రేక్షకులలో దేశభక్తి ఆవేశాన్ని నింపగా, కాంతార చిత్రంలోని పాటలు, మహర్షి సినిమాలోని రైతు గొప్పతనాన్ని చాటే ‘ఇదే కదా.. ఇదే కదా..’ గీతం, దిల్ సే టైటిల్ సాంగ్‌లు శ్రోతలకు మరుపురాని అనుభూతిని పంచాయి. సాక్సోఫోన్ వంటి వివిధ సంగీత వాయిద్యాలపై నేవీ బృందం చూపిన సమన్వయం, నిపుణత అందరినీ ఆకట్టుకున్నాయి. సంగీత విభావరి మధ్యలో భారత నావికాదళ విశిష్టతలను, విశాఖ నగరంతో నేవీకి ఉన్న విడదీయలేని అనుబంధాన్ని అధికారులు వివరించారు. ఆసియాలోనే ప్రసిద్ధి గాంచిన సబ్‌మైరెన్ స్కూల్, సబ్‌మైరెన్ హెడ్ క్వార్టర్స్ తయారీ యూనిట్లు విశాఖలోనే ఉండటం గర్వకారణమని పేర్కొన్నారు. భారత నావికాదళ నినాదం ‘శం నో వరుణః’ అంతరార్థాన్ని , ప్రాముఖ్యతను ఈ సందర్భంగా ఆహూతులకు వివరించారు.


