సహకార రంగంపై కేంద్రం పెత్తనమా?
సీతంపేట: విశాఖపట్నం కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో కేంద్ర ప్రభుత్వ సహకార చట్ట సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. బి.ఆర్.అంబేడ్కర్ భవనంలో జరిగిన ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన బ్యాంకు అధ్యక్షుడు జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ 2020లో తీసుకువచ్చిన సవరణల వల్ల సహకార సంఘాల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటోందని విమర్శించారు. ముఖ్యంగా పాలకవర్గ పదవీ కాలపరిమితిని నిర్దేశించడం, సభ్యుల పదవులను రద్దు చేసే అధికారాలను రిజర్వ్ బ్యాంకుకు అప్పగించడం వంటి నిర్ణయాలు సభ్యుల ప్రజాస్వామిక హక్కులను హరించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉపాధ్యక్షుడు చలసాని రాఘవేంద్రరావు, పూర్వ అధ్యక్షుడు మానం ఆంజనేయులు మాట్లాడుతూ ఈ చట్ట సవరణలు సహకార స్ఫూర్తికే విఘాతమని, ఇది జాతీయ స్థాయి సమస్య అని పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల అర్బన్ బ్యాంక్ ఫెడరేషన్లు ఇప్పటికే వీటిని వ్యతిరేకిస్తున్నాయని, ఈ నిబంధనల అమలును ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. న్యాయపరమైన ఇబ్బందులను చర్చిస్తూ, సహకార రంగాన్ని కాపాడుకునేందుకు అవసరమైన తీర్మానాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో బ్యాంకు పాలకవర్గం సభ్యులు సీఆర్ సుకుమార్ ఈ చట్టాలలోని న్యాయపరమైన ఇబ్బందులను వివరించారు. పాలకవర్గ సభ్యుడు సి.కృష్ణమోహన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


