మద్యం మత్తులో నేవీ అధికారి వీరంగం
ట్రాఫిక్ ఎస్‌ఐపై దాడి
మల్కాపురం: నేవీ అధికారి మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి, విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐపైనే దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలివి.. మల్కాపురంలో ఐవోసీ పైప్‌లైన్ పనులు జరుగుతుండటంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నేవీ లెఫ్టినెంట్ కమాండర్ రాహుల్ కృష్ణ.. పూటుగా మద్యం సేవించి అదే మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీనివాసరావు ఆయన్ని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన రాహుల్ కృష్ణ.. ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగి, ఆయనపై దాడి చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధి నిర్వహణకు ఆటంకం కలిగించడంతో పాటు, దాడికి పాల్పడినందుకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


