నయనానందకరం.. కూచిపూడి నృత్య రూపకం
మద్దిలపాలెం: కళాభారతి వేదికగా మూడు రోజుల పాటు జరిగిన నృత్యోత్సవాలు ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో భాగంగా కుర్మన్నపాలెం నృత్య కలానికేతన్ కళాకారులు ప్రదర్శించిన ‘శ్రీనివాస కళ్యాణం’ కూచిపూడి నృత్య రూపకం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. కళాభారతి అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్ రాజేంద్ర,నర్సింగ్ రావు కార్యక్రమాన్ని ప్రారంభించారు. గురు కె. హైమావతి పర్యవేక్షణలో 47 మంది విద్యార్థులు ప్రదర్శించిన ఈ రూపకంలో గోవిందుని జననం నుంచి కళ్యాణ ఘట్టం వరకు అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే బెంగళూరుకు చెందిన పి. ప్రవీణ్ కుమార్ భరతనాట్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆల్వార్ దాస్ గ్రూప్ చైర్మన్ రాజేంద్ర మాట్లాడుతూ ప్రాచీన కళలను కాపాడటంలో కళాభారతి చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా కళాకారులను, నిర్వాహకులను సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. జనవరి 6 నుంచి 12 వరకు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ రాంబాబు ప్రకటించారు.


