రైల్వేస్టేషన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు
తాటిచెట్లపాలెం: విశాఖ రైల్వే స్టేషన్‌లో డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఆదివారం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. పండగ సీజన్ కావడంతో ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, స్టేషన్‌లో వారికి అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ముఖ్యంగా రద్దీ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, ప్లాట్‌ఫాంలపై భద్రతను సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. స్టేషన్ ప్రాంగణంలోని బుకింగ్ కార్యాలయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనితీరును తనిఖీ చేయడంతో పాటు, ప్రయాణికులకు అందుతున్న తాగునీటి సౌకర్యం, ప్లాట్‌ఫాంల పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం స్టేషన్‌లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం (ఆపరేషన్స్) కె. రామారావు, ఇతర రైల్వే ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


