సర్క్యూట్ ట్రైన్ మళ్లీ మొరాయింపు
ఆరిలోవ: కై లాసగిరిపై వీఎంఆర్‌డీఏ నిర్వహిస్తున్న విశాఖ దర్శన్ టాయ్ ట్రైన్(సర్క్యూట్ ట్రైన్) మళ్లీ మూలకు చేరింది. సందర్శకులతో శుక్రవారం స్టేషన్ వద్ద బయలుదేరిన ఈ ట్రైన్ కొద్ది మీటర్లు ముందుకు వెళ్లిన అనంతరం బ్రేకులు పనిచేయకపోవడంతో తిరిగి వెనక్కి మళ్లింది. లోపల ఉన్న సందర్శకులు భయంతో కేకలు వేయడంతో డ్రైవర్ నెమ్మదిగా ట్రైన్ నిలిపేశాడు. సందర్శకులంతా కిందకు దిగిపోవడంతో అంతా ఊపిరి ఊల్చుకొన్నారు. దీంతో శనివారం నుంచి దీన్ని నిలిపేశారు. ఎన్నిరోజులు ఇది మూలన ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత 10 నెలల్లో మూడుసార్లు మొరాయించింది. ఇది తరచూ బ్రేకులు ఫెయిల్ కావడంతో సందర్శకులు ఆందోళన చెందుతున్నారు.
ఇది మూడోసారి
వీఎంఆర్‌డీఏ అధికారుల నిర్లక్ష్యంతో సర్క్యూట్ ట్రైన్ సందర్శకులతో దోబూచులాడుతోంది. ఇది తరచూ మరమ్మతులకు గరవుతున్నా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇంతవరకు మూడుసార్లు మొరాయించింది. ఫ్యాన్‌లు తిరగకపోవడం, ఏసీలు పనిచేయకపోవడం, జనరేటర్ మూలకు చేరడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న దీన్ని నిలిపేశారు. మరమ్మతులు చేపట్టి రెండు వారాలకు మళ్లీ పట్టాలు ఎక్కించారు. అనంతరం రెండు వారాలు పనిచేసిన ఈ ట్రైన్ మార్చి 17న చక్రాలు విరిగిపోయి పట్టాలు తప్పింది. ఆ సమయంలో పెద్ద ప్రమాదమే తప్పింది. పట్టాలు తప్పినచోటే రైలు సుమారు నాలుగు నెలలు పాటు నిలిచిపోయింది. అనంతరం దీనిలో బాగా పాడయిన ఒక బోగీని తొలగించి మిగిలిన రెండింటితో నడుపుతున్నారు. అది కూడా ఇప్పుడు మొరాయించింది. సంక్రాంతి పండగ సందర్భంగా కనీసం వారంరోజుల పాటు కై లాసగిరి సందడిగా ఉంటుంది. వారికి సర్క్యూట్ ట్రైన్ దూరమైనట్లే.


