నగర పోలీస్ కమిషనర్‌కు డీజీగా పదోన్నతి
అల్లిపురం: నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి కి డైరెక్టర్ జనరల్(డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువరించారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌లకు అబవ్ సూపర్ టైమ్ స్కేల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(లెవెల్–16)గా పదోన్నతికల్పించారు. గతంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా, లా అండ్ ఆర్డర్ ఏడీజీగా బాగ్చి విశేష సేవలు అందించారు. సీపీ బాగ్చికి పదోన్నతి లభించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పూర్తి స్థాయి డీజీ హోదాలో, తన అపార అనుభవంతో విశాఖ నగర భద్రతను మరింత మెరుగుపరుస్తారని ఆశిస్తూ పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


