దేశంలో మనువాదం అమలుకు కుట్ర
ఎంవీపీకాలనీ: దేశంలో మనువాదాన్ని మరోసారి అమలు చేసేందుకు కుట్ర జరుగుతోందని, భారతావని అనే మానస సరోవరానికి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు బ్రహ్మరాక్షసులుగా దాపురించాయని సినీనటుడు ప్రకాష్‌రాజ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏయూ వేదికగా ‘శ్రామిక ఉత్సవ్’ పేరిట నిర్వహిస్తున్న సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభల ప్రారంభోత్సవానికి శనివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. మత విద్వేషాల ముసుగులో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశాన్ని విడదీస్తున్నాయన్నారు. ‘కమలం పువ్వు కింద వేళ్లూనుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ దేశానికి పట్టిన విషం. వందేళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న వారు ఒక్కరైనా ఉన్నారా? ఈ వందేళ్లలో వారు చెడ్డీల నుంచి ప్యాంటులకు మారారు తప్ప.. దేశానికి సాధించిందేమీ లేదు.’ అని ఎద్దేవా చేశారు.
అమ్ముడుపోయిన మీడియా, ప్రభుత్వం
ఉద్యమం అవసరమున్న విశాఖ ప్రాంతంలో సీఐటీయూ మహా సభలు నిర్వహించడం అభినందనీయమని ప్రకాష్ రాజ్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వంతో పాటు మీడియా కూడా అమ్ముడుపోయిందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని నడిపేవారే అమ్ముడుపోతే ప్రజలకు న్యాయం ఏం జరుగుతుందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ చాపకింద నీరులా కార్పొరేట్ల చేతుల్లోకి మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని అడ్డుకోవడానికి నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ‘నేను నటుడిని మాత్రమే కాదు.. అభ్యుదయ ఆలోచనలకు అండగా ఉండేవాడిని. సిటూ వంటి గొప్ప పోరాట సంఘాలు పిలిస్తే రావ డం నా బాధ్యత. చెమట చుక్కకి ఓటమి లేదంటారు.. కానీ నేడు ఆ చెమట చుక్కకు అన్యాయం జరుగుతోంది.’అని అన్నారు. సిని మాల్లో నటిస్తూ ఆనందంగా ఉన్నప్పటికీ.. సీఐటీయూ మాదిరిగా కార్మికులు, సామాన్యుల గొంతుకగా నిలవడమే తనకిష్టమన్నారు.
ప్రజలు రాజకీయం చేయాలి.. పాలకులు పనిచేయాలి
‘ప్రవాహం వెంట వెళ్లి చచ్చిపోయే చేప మాదిరిగా నేను ఉండాలనుకోవడం లేదు.. ప్రవాహానికి ఎదురీదే చేపగా ఉండాలనుకుంటున్నా. అబద్ధం మాట్లాడటానికి ధైర్యం కావాలి.. కానీ నిజం మాట్లాడటానికి కాదు’అంటూ ఆయన కార్మికుల్లో స్ఫూర్తి నింపారు. ప్రజలు రాజకీయం చేయాలని, పాలకులు పనిచేయాలని, కానీ మన దగ్గర అది రివర్స్ అయ్యిందని వ్యాఖ్యానించారు. అనంతరం సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ.గఫూర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు మహాసభలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆలిండియా సీఐటీయూ నాయకుడు కందారపు మురళీ, జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.కె. కుమార్, కె.రమాప్రభ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న ప్రదర్శనలు
సీఐటీయూ మహాసభల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాన వేదికపై రాష్ట్రంలోని వివిధ కళా బృందాలు ప్రదర్శించిన స్ఫూర్తిదాయక గీతాలు, నాటికలు అలరించాయి. పుస్తక ప్రదర్శనను సాహితీ పరిశోధకుడు ఆచార్య వెలమల సిమ్మన్న, లఘుచిత్ర ప్రదర్శనను స్టార్ మేకర్ సత్యానంద్, సాహిత్య ఉత్సవాన్ని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి, సైన్స్ ఎగ్జిబిషన్‌ను డాక్టర్ ఆర్.వి.ఎస్.సుబ్రహ్మణ్యం, కార్టూన్ ఎగ్జిబిషన్‌ను మహాసభల చైర్మన్ సీహెచ్ నరసింగరావు, ఫొటో ఎగ్జిబిషన్‌ను కోశాధికారి ఏవీ నాగేశ్వరరావు తదితరులు ప్రారంభించారు. సామాజిక అంశాలను ప్రతిబింబించే లఘు చిత్రాలు, విశాఖ ఉద్యమాలకు సంబంధించిన ఫొటో ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి.
శ్రామిక ఉత్సవ్‌కు హాజరైన వివిధ వర్గాల ప్రజలు సిటూ అఖిల భారత మహాసభల ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న సినీనటుడు ప్రకాష్‌రాజ్
దేశంలో మనువాదం అమలుకు కుట్ర


