గిరి నర్తనం.. మురిసిన విశాఖ జనం
మహారాణిపేట: పీసా మహోత్సవ్ సందర్భంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన రెండు రోజుల కార్యక్రమాలు బుధవారంతో ఘనంగా ముగిశాయి. ఉదయం నుంచి వివిధ రాష్ట్రాల గిరిజన సంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతుల్ని ఎంతగానో అలరించాయి. ఒక్కో రాష్ట్రానికి ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయ నృత్య, సంగీతాలతో హోరెత్తించారు. చాలా ప్రదర్శనలకు ప్రేక్షకులు సైతం పదం కలిపారు. అనంతరం కళాకారులతో అధికారులు బృంద చిత్రాలు దిగి, జ్ఞాపికలు అందించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రన్, కబడ్డీ, ఆర్చరీ పోటీల విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
పీసా చట్టంపై అవగాహన పెంచేందుకే..
షెడ్యూల్డ్ ఏరియాస్‌లో పీసా చట్టం అమలుపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహిస్తున్న పీసా మహోత్సవ్ కార్యక్రమాలు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో ఘనంగా జరిగాయి. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి ప్రొఫెసర్ ఎస్‌పీ సింగ్ బఘెల్ వీడియో సందేశం ద్వారా గిరిజన హక్కుల కోసం రాజ్యాంగ మద్ధతును తెలిపారు. పీసా పోర్టల్‌ను ప్రారంభించారు. కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్, ఏపీ పంచాయతీరాజ్ –గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, ఏపీ ఎస్‌ఈఆర్‌డీ కమిషనర్ రేవు ముత్యాలరాజు, ఎకనామిక్ అడ్వైజర్ విజయకుమార్ బెహరా, విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అడవి తల్లి బాట కింద చేపట్టిన అభివృద్ధి పనుల ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అరకు కాఫీ, ఇతర ఉత్పత్తులతో కూడిన కిట్‌ను పంచాయతీరాజ్ సెక్రటరీ వివేక్ భరద్వాజ్‌కు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి అందించారు.


