ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గాజువాక : ఏటీఎం కార్డుల ద్వారా నగదు మోసాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని గాజువాక క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. క్రైం సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు. చినగంట్యాడ ప్రాంతానికి చెందిన బలిరెడ్డి కుమారి గత నెల 28న గాజువాకలోని ఎస్‌బీఐ ఏటీఎంకు వెళ్లింది. ఆ సమయంలో ఏటీఎంలో టోపీ ధరించి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి సహాయం చేస్తున్నట్టు నటించి ఆమె వెనుక నిలబడి పిన్ నంబర్‌ను గమనించి మోసపూరితంగా ఏటీఎం కార్డును మార్చేశాడు. ఆమె వెళ్లిపోయిన తరువాత నిందితుడు మార్చిన ఏటీఎం కార్డు ద్వారా రూ.26,500 డ్రా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాజువాక క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మోసానికి పాల్పడింది తెలంగాణలోని మెహబూబాబాద్ దరి బాబాగుట్ట ప్రాంతానికి చెందిన బానోతు రాజు అలియాస్ నాయక్‌గా గుర్తించారు. గాజువాకలో అతడిని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లినట్టు సీఐ తెలిపారు. నిందితుడిపై ఏడు పోలీస్ స్టేషన్లలో 12 కేసులున్నాయన్నారు. నిందితుడి నుంచి రూ.50,500 నగదు, నాలుగు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు సీఐ తెలిపారు.
నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లోని
ఏడు పీఎస్‌లలో కేసులు


