విశాఖ బ్రాండ్‌ ఖతమ్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖ బ్రాండ్‌ ఖతమ్‌

Dec 24 2025 3:46 AM | Updated on Dec 24 2025 3:46 AM

విశాఖ

విశాఖ బ్రాండ్‌ ఖతమ్‌

పిక్నిక్‌ పేరుతో ఓ రిసార్ట్‌లోపేకాట స్థావరం

కౌంటింగ్‌ మెషీన్‌ పెట్టి మరీ జూదం

ఇటీవల గో మాంసం అక్రమ రవాణా

విస్తృతంగా మాదక ద్రవ్యాల సరఫరా

కొమ్మాది: చంద్రబా బు ప్రభుత్వంలో విశాఖ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. లక్షల కిలోల గోమాంసం అక్రమ రవాణా, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా జూదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, డ్రగ్స్‌ సరఫరా వంటి ఘటనలు విశాఖకు అప్రతిష్టను తెచ్చి పెడుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో జరుగుతున్న ఈ వికృత చేష్టలకు స్థానిక పోలీసుల నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆనందపురంలో శివారులో శ్రీమిత్ర మైరెన్‌ ఏజెన్సీస్‌ కోల్డ్‌ స్టోరేజీలో భారీగా గోమాంసం లభించింది. నెలల తరబడి ఈ వ్యవహారాన్ని నాన్చిన పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన నేత పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయం మర్చిపోకముందే భీమిలి బీచ్‌రోడ్డు కె.నగరపాలెం కూడలి సమీపంలో పాత గోకార్టింగ్‌ వద్ద గల ఓ ప్రైవేటు రిసార్టులో పేకాట స్థావరం ఇప్పుడు విశాఖలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ నెల 21వ తేదీన ఏపీ, తెలంగాణకు చెందిన తెలుగుదేశం నాయకులు ఇక్కడ వనసమారాధన పేరుతో భారీ స్థాయిలో పేకాట నిర్వహించారు. బయటకు పిక్నిక్‌గా చెప్పినప్పటికీ.. లోపల మాత్రం భారీ స్థాయిలో జూదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో టీడీపీ నేతలే అధికంగా పాల్గొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా టేబుల్స్‌ వేసి మరీ పెద్ద ఎత్తున జూదం నిర్వహించినట్లు సోషల్‌ మీడియాలో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో డబ్బు లెక్కించడానికి కౌంటింగ్‌ మెషీన్లు ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో పేకాట జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజే రూ.1.85 కోట్లు జూదంలో చేతులు మారినట్టు సమాచారం. ఇంతజరిగినా పోలీసులు అటుగా కన్నెత్తి కూడా చూడలేదు. నిర్మానుష్య ప్రదేశాల్లో డ్రోన్‌లు ఉపయోగించి మందుబాబులను పట్టుకుంటున్న పోలీసులు.. ఈ పేకాట డెన్‌ జోలికి ఎందుకు రాలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖను ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. విశాఖను మద్యం, జూదానికి హబ్‌గా, గోమాంసం విక్రయాలకు కేంద్రంగా మార్చేశారని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి.

సామాన్యులపై కేసు నమోదు

ఆదివారం జరిగిన భారీ బహిరంగ జూదంపై పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. ఈ జూదంలో టీడీపీ నేతలు పచ్చ చొక్కాలు వేసుకుని మరీ పాల్గొన్నట్లు స్పష్టంగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. వారిని వదిలి సామాన్యులపై మాత్రమే కేసులు నమోదు చేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. స్థానిక పోలీసులకు నెలవారి మామూళ్లు అందడంతోనే ఈ పేకాట డెన్‌ వైపు కన్నెత్తి చూడలేదని తెలిసింది. నగరంలో పెట్రోల్‌ బంక్‌లు నిర్వహిస్తున్న అధికార పార్టీకి చెందిన నేత ఈ పేకాట డెన్‌ నిర్వహించినట్లు సమాచారం. ఈ విషయంపై నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు అందగా.. భీమిలి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంటనే ఈ పేకాట ఆడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేయాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.

విశాఖ బ్రాండ్‌ ఖతమ్‌1
1/1

విశాఖ బ్రాండ్‌ ఖతమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement