వినతులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, వాటికి సకాలంలో, నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుపై సరైన రీతిలో ఎండార్స్‌మెంట్ ఇవ్వడమే కాకుండా, బాధితులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 377 వినతులు అందగా అందులో అత్యధికంగా జీవీఎంసీకి సంబంధించి 121, రెవెన్యూ విభాగానికి 106 ఫిర్యాదులు ఉన్నాయి.
అలాగే పోలీస్ శాఖకు 34 వినతులు రాగా, ఇతర శాఖలకు కలిపి 116 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్‌తో పాటు ఇంచార్జి డీఆర్‌వో సత్తిబాబు, యూసీడీ పీడీ సత్యవేణి, ఏసీపీ ధనుంజయ రెడ్డి , వివిధ విభాగాల అధికారులు పాల్గొని ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు.


