రహదారుల నిర్వహణ ప్రైవేటు సంస్థలకా?
ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
పీజీఆర్‌ఎస్‌లో సీపీఎం ఫ్లోర్ లీడర్ గంగారావు వినతి
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు
99 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 99 వినతులు అందాయి. శాఖల వారీగా చూస్తే పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి అత్యధికంగా 42 ఫిర్యాదులు రాగా, ఇంజనీరింగ్‌కు 22, రెవెన్యూకు 12, అడ్మినిస్ట్రేషన్‌కు 9, యూసీడీ విభాగానికి 7 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. సమస్యలను అదే రోజు పరిశీలించి, నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించాలని, బాధితులు ప్రతి వారం ఒకే సమస్యపై కార్యాలయానికి రాకుండా చూడాలని జోనల్ కమిషనర్లకు, విభాగాధిపతులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అదే సమయంలో నగరంలో రోడ్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై రాజకీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. జీవీఎంసీ పరిధిలోని సుమారు 88.3 కిలోమీటర్ల ప్రధాన రహదారులను పదేళ్ల పాటు పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి. గంగారావు మేయర్‌కు వినతిపత్రం అందజేశారు. మధురవాడ, ఎంవీపీ, గాజువాక వంటి కీలక ప్రాంతాల్లో రోడ్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ రూ. 306 కోట్లు చెల్లించడం భారీ కుంభకోణమని ఆయన ఆరోపించారు. ప్రజల పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే కాకుండా, అడ్వర్టైజ్‌మెంట్లు, పార్కింగ్ ఫీజుల పేరిట సామాన్యులపై అదనపు భారం మోపడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసిన సంస్థలకు భారీగా కమీషన్లు చెల్లించడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఈ విధానం వల్ల జీవీఎంసీ తన ఉనికిని కోల్పోయి ప్రైవేట్ కార్పొరేషన్‌గా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


