ఉపాధి హామీ పథకానికి కేంద్రం తూట్లు
బీచ్‌రోడ్డు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎటువంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని వామపక్ష పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. రెహమాన్, సీపీఎం నేత పి.మణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను తగ్గించడం వల్ల ఈ పథకం నిర్వీర్యమవుతుందని, దీనివల్ల రాష్ట్రంపై ఏటా నాలుగు వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల కోత వల్ల వ్యవసాయ కూలీలకు తీవ్ర నష్టం జరుగుతుందని, గ్రామాల నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర కూటమిలో భాగస్వాములుగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ విషయంలో మౌనం వీడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్య విలువలను అవమానించడమేనని నేతలు విమర్శించారు. దశాబ్దాలుగా గ్రామీణ పేదలకు, చేతివృత్తిదారులకు జీవనోపాధిని కల్పిస్తూ చట్టబద్ధమైన హక్కుగా ఉన్న ఈ పథకాన్ని పేరు మార్పులు, నిధుల కోతలతో నిర్వీర్యం చేయడం సరికాదని పేర్కొన్నారు. పథకాన్ని రద్దు చేసి కొత్తగా తీసుకువచ్చిన జీరాంజీ పథకం కేవలం కార్పొరేట్ శక్తులకు మేలు చేసేలా ఉందని, ఇది గ్రామీణ పేదలను రోడ్డున పడేస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, సీపీఎం జిల్లా నాయకుడు ఎం కష్ణారావు, సీపీఐఎంఎల్ ప్రజా పోరు నాయకుడు కె.దేవా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.పైడిరాజు, ఎం.మన్మథరావు, ఎన్.నాగభూషణం, కె.వనజాక్షి, సీఎన్ క్షేత్రపాల్, జి.రాంబాబు, పి.సూర్య కుమారి, జి.జయ, ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


