నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యత
మహారాణిపేట: విశాఖ నగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నగరంలో క్షీణిస్తున్న వాయు నాణ్యతపై తక్షణమే స్పందించాలని సూచించారు. ఇటీవల విశాఖలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుందన్న వార్తల నేపథ్యంలో.. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా జిల్లా స్థాయి క్వాలిటీ మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. నగరంలో చెత్త, వ్యర్థాలను తరలించే వాహనాలను పూర్తిగా టార్పాలిన్‌తో కప్పాలని, పరిమితికి మించి లోడ్‌తో వెళ్లరాదని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
భవన నిర్మాణాలు చేపట్టేటప్పుడు తప్పనిసరిగా గ్రీన్ మ్యాట్‌లు కప్పాలని, కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను రోడ్ల పక్కన ఎక్కడపడితే అక్కడ పారబోయవద్దని కలెక్టర్ స్పష్టం చేశారు. రాత్రి వేళల్లో నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలపై నిఘా ఉంచాలని, నిబంధనలు మీరితే వాహనాలను సీజ్ చేయాలన్నారు. పరిశ్రమల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ సక్రమంగా పనిచేసేలా చూడాలని, సిగ్నల్ పడినప్పుడు వాహనదారులు ఇంజిన్ ఆఫ్ చేసేలా చైతన్యం తేవాలన్నారు. బస్టాపుల వద్ద ఆటోలు, బస్సులు ఎక్కువసేపు ఇంజిన్ ఆన్ చేసి ఉంచితే రవాణా, పోలీస్ శాఖలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాత వాహనాలకు పొల్యూషన్ చెక్ చేయించాలని, ఆర్టీసీ బస్సుల నుంచి కాలుష్యం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెట్రోల్ బంకుల్లో కల్తీ జరగకుండా తనిఖీలు చేయాలని పౌర సరఫరాల శాఖ, లీగల్ మెట్రాలజీ అధికారులకు సూచించారు. ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ ముకుందరావు, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ రమణమూర్తి, ఆర్టీసీ ఆర్‌ఎం అప్పలనాయుడు, డీపీవో శ్రీనివాసరావు, డీఎస్‌వో భాస్కరరావు, పోర్ట్ అధికారులు, హెచ్‌పీసీఎల్, కోరమండల్, ఫార్మాసిటీ ప్రతినిధులు, రెడ్‌క్రాస్, వలంటీర్స్ పాల్గొన్నారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీ ఇదే..: చైర్మన్‌గా కలెక్టర్, కన్వీనర్‌గా ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ (సీపీబీ), సభ్యులుగా నగర పోలీస్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు డైరెక్టర్, డీటీసీ, ఆర్టీసీ రీజనల్ మేనేజర్, జిల్లాపరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా పౌర సరఫరాల అధికారి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఎస్‌ఈ ఈపీడీసీఎల్, జిల్లా పంచాయతీ అధికారితో కమిటీని ఏర్పాటు చేశారు.


