బీమా రంగంలో ఎఫ్‌డీఐ పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి
డాబాగార్డెన్స్: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎల్‌ఐసీ ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకత తెలుపుతూ గురువారం డివిజనల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విశాఖ డివిజన్ ఐసీఈయూ ప్రధాన కార్యదర్శి జి.వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపాదిత బిల్లులోని లోపాలు, దాని ప్రభావాలను వివరించారు. ఈ బిల్లు అమలులోకి వస్తే దేశ ప్రజలు కష్టపడి దాచుకున్న పొదుపు నిధులు విదేశీ మూలధనానికి బదిలీ అయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో క్లాస్–1 ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యంబాబు, గణపతిరామ్, ఫణీంద్ర, తిరుమలరావు, బీటీ ప్రసాద్ తదితరులు పాల్గొని తమ గళాన్ని వినిపించారు. వీరికి బ్యాంక్ యూనియన్ నాయకురాలు, ఎన్‌సీబీఈ సెక్రటరీ జనరల్ సుష్మ సంఘీభావం ప్రకటించారు. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినదించారు.


