ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ఆరిలోవ : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూనియన్ ఆఫ్ టీచర్స్ ఫెడరేషన్(యూటీఎఫ్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు గురువారం డీఈవో కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలని, ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని, విద్యా హక్కు చట్టంలోని 23(1) సెక్షన్‌కు తగిన సవరణలు చేయాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు అనకాపల్లి పైడిరాజు, అధ్యక్షుడు దాసరి నాగేశ్వరరావు మాట్లాడుతూ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను మినహాయించడానికి సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. దీని కోసం పార్టమెంట్‌లో చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతికి సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌లో రెండో శనివారం, ఆదివారం, పండగ రోజులను సెలవు తేదీలుగా ప్రకటించాలన్నారు. యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి టి.ఆర్.అంబేడ్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బోధనేతర పనులను రద్దు చేసి, స్వేచ్ఛాయుత వాతావరణంలో బోధన చేసే అవకాశం కల్పించాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల కార్యాచరణలో ప్రతి రోజు పరీక్ష పెట్టే విధానం రద్దు చేయాలన్నారు. సింగిల్ టీచర్ల సెలవులకు ప్రాధాన్యత ఇవ్వాలని, జీవీఎంసీలో అర్హులైన ఎస్జీటీలకు తెలుగు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పదోన్నతులు కల్పిచాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం డీఈవో ఎన్.ప్రేమకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ కోశాధికారి రాంబాబు, విజయకుమారి, రామకృష్ణ, మహ్మద్ రిజ్వాన్, రాజునాయుడు, సంతోష్‌తో పాటు జిల్లాలో పలు మండలాలు యూనియన్ అధ్యక్షులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి


