వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోవాలి
డాబాగార్డెన్స్: వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్లో సీపీఐ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నూతనంగా ఏర్పాటు చేసిన 10 వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం జీవో 500 జారీ చేయడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు దెబ్బతినడమే కాకుండా పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని విమర్శించారు. దాదాపు 60 ఏళ్ల పాటు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అన్యాయమని, యాజమాన్య కోటా సీట్ల అమ్మకం వల్ల పేదలకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 17 కళాశాలలను ఏర్పాటు చేస్తే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని పీపీపీ పరిధిలోకి తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం వల్ల ప్రభుత్వ భూములు, భవనాలు, వసతులు, కాలేజీల ఆస్పత్రులు దాదాపు 60 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. మొత్తం 1000 సీట్లు త్వరగా అందుబాటులోకి వస్తాయని, అందులో 76 శాతం సీట్లు పేదలకు లభిస్తాయని ప్రభుత్వం చెబుతున్నా 25 శాతం యాజమాన్య కోటా సీట్లను (371 సీట్లు) ఒక్కొక్కటి రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందన్నారు. తక్షణమే జీవోను ఉపసంహరించి, వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే రహ్మన్, కె.సత్యనారాయణ, పి.చంద్రశేఖర్, ఎం.పైడిరాజు, సంత్యాంజనేయ, మన్మధరావు, శ్రీనివాసరావు, క్షేత్రపాల్, బేగం, వనజాక్షి, నాగభూషణం, నాగరాజు, అచ్యుతరావు, రాంబాబు, సత్యనారాయణ, సూర్య పద్మ, జయ, అప్పన్న, ఆదినారాయణ, ఈశ్వరరావు, దేముడమ్మ, పుష్పలత, లక్ష్మణరావు, కాసుబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


