ఇంజినీరింగ్‌లో పరిశోధనలు పెరగాలి
మురళీనగర్ : ఇంజినీరింగ్ విభాగంలో పరిశోధనలు ఎక్కువగా జరగాలని సీజీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ టి.విశ్వేశ్వరరావు అన్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ‘డిజిటల్ మేకోవర్ ఇన్ ఇంజినీరింగ్ అప్లికేషన్స్.. ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ సస్టైనబిలిటీ’ అనే అంశంపై నిర్వహించిన ఏఐసీటీఈ అటల్ వాణి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. భారతదేశం వేగంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో, ఇంజినీరింగ్ విద్యార్థులు, పరిశోధకులు ఆధునిక సాంకేతికతలను స్వీకరించి పరిశోధనాత్మక దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్ సాంకేతికతలు, పారిశ్రామిక అభివృద్ధిలో సస్టైనబుల్ ఇంజినీరింగ్ కీలకమవుతుందన్నారు. సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలకు చెందిన 60 సాంకేతిక పరిశోధన పత్రాలను ప్రదర్శించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, స్మార్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్స్, సస్టైనబుల్ టెక్నాలజీలపై డాక్టర్ కె.రత్నకుమార్ ప్రసంగిస్తూ అధిక శక్తి సాంద్రత, కచ్చితత్వం, లోతైన వెల్డ్ పెనెట్రేషన్ వంటి లక్షణాల ద్వారా ఆధునిక తయారీ రంగాల్లో ‘ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్’’ సాంకేతికత ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. ‘స్మార్ట్ సాయిల్ టెస్టింగ్ మెథడ్స్’ అంశంపై డాక్టర్ కె.రాజ్యలక్ష్మి ప్రసంగిస్తూ సెన్సార్ ఆధారిత మట్టి పరీక్షా విధానాలు, ఐవోటీ, రియల్–టైమ్ డేటా విశ్లేషణ, మట్టి పోషకాల అంచనా వంటి ఆధునిక పరిష్కారాలను వివరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్, ఇండస్ట్రీ 4.0, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటీ, డిజిటల్ ట్విన్, డేటా ఆధారిత ఇంజినీరింగ్ అప్లికేషన్లు వివిధ ఇంజినీరింగ్ రంగాలపై చూపుతున్న ప్రభావాన్ని డాక్టర్ రాజు చిట్ల విశ్లేషించారు. కోఆర్డినేటర్ డాక్టర్ కె.నారాయణ రావు పర్యవేక్షణలో జరిగిన సదస్సులో తుమ్మిడి చారిటబుల్ చైర్మన్ ట్రస్ట్ తుమ్మిడి రామ్‌కుమార్, కో–కోఆర్డినేటర్లు డాక్టర్ రాజు చిట్ల, భరణి మారోజు పాల్గొన్నారు.


