ఏం బ్యాగుంది? | - | Sakshi
Sakshi News home page

ఏం బ్యాగుంది?

Dec 17 2025 6:37 AM | Updated on Dec 17 2025 6:37 AM

ఏం బ్

ఏం బ్యాగుంది?

సర్కారు వారి బ్యాగులు.. చిరుగులు మూణ్నాళ్ల ముచ్చటగా విద్యార్థి మిత్ర కిట్లు

బయట కొనుగోలు చేసిన బ్యాగులతో తోటగరువు హైస్కూల్‌కు వెళ్తున్న విద్యార్థులు

ఆరిలోవ: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర’ కిట్లు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. ఈ కిట్లలో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు అందించిన స్కూల్‌ బ్యాగులు నాసిరకంగా ఉండటంతో కొద్ది రోజులకే చిరిగిపోయాయి. మరోవైపు విద్యార్థులకు వారి కాలి కొలతలకు సరిపడే బూట్లను పంపిణీ చేయడంలోనూ ప్రభుత్వం విఫలమైంది.

సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవి సెలవులు ముగిసిన వెంటనే, జూన్‌ రెండో వారంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, బ్యాగులు, బూట్లు, యూనిఫాంతో కూడిన కిట్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఏవైనా కిట్లు సరిపోకపోతే, ఒకటి రెండు వారాల్లో మిగిలిన వారికి పంపిణీ చేయడం ఆనవాయితీ. కానీ, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం పంపిణీ చేసిన కిట్లలోని వస్తువులు చాలీచాలనివిగా ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతున్నా, ఇంకా చాలా మందికి బూట్లు, బ్యాగులు అందకపోవడం గమనార్హం. హైస్కూల్‌ విద్యార్థుల పుస్తకాల బరువును తట్టుకునేలా బ్యాగుల నాణ్యత లేకపోవడంతో అవి త్వరగా చిరిగిపోతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి పుస్తకాల బరువును బట్టి బ్యాగు నాణ్యత ఉంటే బాగుండేదని పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.

చిరిగిపోతున్న బ్యాగులు

ఈ ఏడాది జూన్‌లో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర పేరుతో కిట్లు అందజేశారు. అయితే, కొన్ని తరగతులకు పాఠ్య పుస్తకాలు కూడా కొరతగానే ఉన్నాయి. పాఠశాలలు తెరిచిన నెల రోజుల తర్వాత పుస్తకాలు ఇవ్వడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులు నాణ్యత లేకపోవడంతో, పుస్తకాల బరువుకు రెండు నెలలకే అవి చిరిగిపోయాయి. దీంతో కొందరు విద్యార్థులు చిరిగిన బ్యాగులతోనే పాఠశాలలకు వెళ్లాల్సి వస్తుండగా, కొందరు బయట కొత్త బ్యాగులు కొనుగోలు చేస్తున్నారు. నాసిరకం బ్యాగుల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా, పంపిణీ సమయంలోనే కొరత కారణంగా జిల్లాలో 8,789 మంది విద్యార్థులకు అసలు బ్యాగులే అందలేదు. ఇప్పటికీ వారికి బ్యాగులు సరఫరా కాకపోవడం విచారకరం.

6,000 మందికి బూట్లు అందలేదు

జిల్లాలో సుమారు 6,000 మందికి పైగా విద్యార్థులకు బూట్లు అందలేదు. అందిన వారికి కూడా సాక్సులు, బూట్లు అరకొరగానే ఇచ్చారు. ముఖ్యంగా విద్యార్థుల కాలి కొలతల ప్రకారం బూట్లు రాకపోవడంతో అవి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కొన్ని రోజుల కిందట కొన్ని మండలాలకు బూట్లు వచ్చినప్పటికీ, వాటిని ఇంకా సైజుల వారీగా విద్యార్థులకు సర్దుబాటు చేయాల్సి ఉంది. విద్యా సంవత్సరం సగం గడిచిపోవడంతో విద్యార్థులు బయట కొన్న బూట్లు లేదా చెప్పులతోనే బడికి వెళ్తున్నారు.

జిల్లాలో మొత్తం 594 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 72,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 33,830 మంది బాలురు, 38,697 మంది బాలికలు ఉన్నారు. వీరిందరికీ కిట్లు పంపిణీ చేయాల్సి ఉండగా, 8,789 మందికి బ్యాగులు అందలేదు. అలాగే సుమారు 6,000 మందికి బూట్లు (ఒక జత), సాక్సులు (రెండు జతలు) అందలేదు.

బ్యాగు చిరిగిపోయింది..

నాకు స్కూల్‌లో ఇచ్చిన బ్యాగు కొద్దిరోజులకే చిరిగిపోయింది. అందుకే కొత్త బ్యాగు కొనుక్కున్నాను. ఇందులో ఎన్ని పుస్తకాలు పెట్టినా తట్టుకుంటోంది. చాలా రోజుల నుంచి ఈ బ్యాగుతోనే స్కూల్‌కు వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది బ్యాగులు చిరిగిపోయాయి. వారు కూడా కొత్తవి కొనుక్కున్నారు.

– హేమంత్‌, 6వ తరగతి,

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, తోటగరువు

ఏం బ్యాగుంది?1
1/2

ఏం బ్యాగుంది?

ఏం బ్యాగుంది?2
2/2

ఏం బ్యాగుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement