నగర భద్రత, అభివృద్ధి కోసం ‘సెవెన్ డ్రీమ్స్’
విశాఖ సిటీ : నగరంలో భద్రత, సంక్షేమం, అభివృద్ధే ప్రధానంగా ‘సెవెన్ డ్రీమ్స్’ అనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పేర్కొన్నారు. నగరంలో వివిధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో విశాఖ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (వీసీఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ గల నగరంగా, ఆ తర్వాత ప్రపంచంలోనే ఆదర్శ పోలీసింగ్ నగరంగా తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో విశాఖ భద్రతా మండలి కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
● 2026 ఏప్రిల్ 1 నుంచి ఏఐ ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆటోమేటిక్ నెంబర్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి చలానా జారీ అవుతుందన్నారు. తద్వారా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణపై మాత్రమే దృష్టి సారిస్తారన్నారు.
● మహిళలపై జరుగుతున్న నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
● ఆశ్రయం లేని వారికి, ట్రాన్స్‌జెండర్లు, జైలు నుంచి విడుదలైన మాజీ ఖైదీలు, డ్రగ్, మద్యం వ్యసనాల నుంచి కోలుకున్నవారికి తగిన ఉపాధి కల్పిస్తే వారు తప్పుడుదారుల్లోకి వెళ్లే అవకాశాలు ఉండవని వివరించారు.
● హోంగార్డుల కోసం హోంగార్డ్ వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసి ఆరోగ్య బీమా కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు.
● ప్రతీ ప్రాంతంలో నైట్ విజన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఫుటేజ్‌ను క్లౌడ్‌లో భద్రపరచాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా జాతీయ లేదా రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాబేస్‌లలో ఉన్న నేరస్తులను గుర్తించి వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసే విధానం అమలు చేస్తామని తెలిపారు.
● బీచ్ భద్రత, ట్రాఫిక్ ఉపకరణాలపై దృష్టి సారించాలని, మునిగిపోయే అవకాశం ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, లైట్లు, లైఫ్‌గార్డ్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.
● వ్యసన విముక్తి కేంద్రాలు సరిపోవడం లేదని, ప్రతి డ్రగ్‌కు ఉత్తమ చికిత్స అందించే కేంద్రం ఏర్పాటు చేయడానికి భద్రతా మండలి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ద్వారా అద్భుతాలు సాధించవచ్చన్నారు. చాలా కాలంగా భద్రతా మండలి నిద్రావస్థలో ఉందని, ఇకపై చురుకుగా పనిచేసే, తనను కూడా నిద్రపోనివ్వని సభ్యులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


