
పోర్టల్ ప్రారంభిస్తున్న హోం మంత్రి అనిత, రీజినల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి
అల్లిపురం: సవరించిన అగ్నిమాపక సేవల శాఖ వెబ్‌సైట్, ఆన్‌లైన్ ఫైర్ సర్వీస్ (ఎన్‌ఓసీ) పోర్టల్‌ను హోం మంత్రి అనిత ప్రారంభించారు. ఎంవీపీ కాలనీలోని హెచ్‌హెచ్‌ఎం బేస్ క్యాంపులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కొత్త పోర్టల్ పౌరులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
ఇకపై పౌరులు ప్రొవిజనల్, ఆక్యుపెన్సీ, పునరుద్ధరణ (రిన్యూవల్), ఎన్‌వోసీల కోసం అగ్నిమాపక శాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. ఈ సర్టిఫికెట్లు ఏపీ ఫైర్ యాక్ట్ 1999, ఏపీ బిల్డింగ్ రూల్స్ 2017, నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా (ఎన్‌బీసీ 2016) ప్రకారం స్వయంచాలకంగా జారీ అవుతాయన్నారు.
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ పి. వెంకట రమణను ఆమె అభినందించారు. కార్యక్రమంలో ప్రాంతీయ అగ్నిమాపక అధికారి డి. నిరంజన్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.