
ప్లాస్టిక్ బ్యాట్లలో గంజాయి నింపి..
తాటిచెట్లపాలెం: గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే, స్మగ్లర్లు మాత్రం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ పోలీసులకు సవాలు విసురుతున్నారు. తాజాగా విశాఖ రైల్వే స్టేషన్‌లో జరిగిన తనిఖీల్లో పోలీసులు కూడా ఊహించని విధంగా గంజాయిని తరలిస్తున్న తీరు వెలుగులోకి వచ్చింది. మంగళవారం జీఆర్పీ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇన్‌స్పెక్టర్ సిహెచ్. ధనుంజయ నాయుడు నేతృత్వంలో జీఆర్పీ ఎస్‌ఐ కేటీఆర్ లక్ష్మి, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ పీఆర్ బిశోయి తమ బృందంతో కలిసి ప్లాట్‌ఫామ్‌లపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన ఈసమేతర ఖతున్, ఒడిషాలోని గంజాం జిల్లాకు చెందిన గీత నాయక్గా గుర్తించారు. వారి బ్యాగులు, ఇతర వస్తువులను పరిశీలించగా, పోలీసులు విస్తుపోయారు. ఈ మహిళలు తమ పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ బ్యాట్ల హ్యాండిళ్లను కట్ చేసి అందులో గంజాయిని నింపి.. టేప్‌తో అతికించి, దానిపై రబ్బరు తొడుగును అమర్చారు. కేరళకు గంజాయి తరలించేందుకు వారు ఈ పద్ధతిని అనుసరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ విధంగా మొత్తం రూ. 90వేలు విలువైన 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఇద్దరు మహిళలను అరెస్టు చేసిన
జీఆర్పీ పోలీసులు