
ముసురు ముంచెత్తింది
సాక్షి, విశాఖపట్నం : రెండు రోజులుగా ఏకధాటిగా మహా నగరాన్ని ముసురు ముంచెత్తింది. ఒడిశా సమీపంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం మొదలైన వర్షం మంగళవారం సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసింది. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం కారణంగా పలు రహదారులు జలమయమయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తింది. గెడ్డలు, మురుగు కాలువలు పొంగిపొర్లాయి. బుధవారం వినాయక చవితి కావడంతో పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వినాయక మండపాలు నిర్మించేందుకు భక్తులు అష్టకష్టాలు ఎదుర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాస్తా తెరిపినివ్వడంతో ప్రజలంతా ఒక్కసారి రోడ్లపైకి వచ్చారు. దీంతో నగరం ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు, పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు మార్కెట్‌లోకి పోటెత్తారు. బుధవారం ఉదయం వర్షం కురిసి.. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి వర్షం తగ్గుముఖం పట్టనుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
మంగళవారం
ఉదయం 8.30 నుంచి
సాయంత్రం 4 గంటల వరకూ
కురిసిన వర్షపాతం
ప్రాంతం వర్షపాతం
(మిమీ.ల్లో)
భీమిలి 59.6
మహరాణిపేట 52.2
పెందుర్తి 51.8
ములగాడ 51.4
గాజువాక 51.4
ఆనందపురం 51.2
పెదగంట్యాడ 51.0
ఆరిలోవ 50.6
సీతమ్మధార 48.6
గోపాలపట్నం 44.2
పద్మనాభం 39.8
జిల్లాలో మొత్తం
వర్షపాతం 551.8