
రోడ్డు ప్రమాదంలో సెజ్ ఉద్యోగి మృతి
పరవాడ: స్థానిక తహసీల్దార్ కార్యాలయ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం ట్యాంకర్ లారీ వెనుక చక్రాల కింద పడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం కూనవరం గ్రామానికి చెందిన సుంకర వీరబాబు(38)గా గుర్తించారు. ఈయన అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లోని మెట్రోకెమ్ పరిశ్రమ ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాలు. అచ్యుతాపురం నుంచి తన ద్విచక్ర వాహనంపై లంకెలపాలెం వైపు వెళ్తున్న క్రమంలో ముందు ఉన్న ట్యాంకర్ లారీని తప్పించే క్రమంలో అదుపుతప్పి ఆ లారీ కింద పడిపోవడంతో మృతుడి ఎడమ కాలు మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లిపోయాయి. ప్రమాదంలో తీవ్ర రక్త స్రావం అయింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం గాజువాకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు పరవాడ సీఐ మల్లికార్జునరావు తెలిపారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించినట్లు వెల్లడించారు.