
కుమార్తెలు, మరిదే హంతకులు
అనకాపల్లి: గాజువాక మండలం, కూర్మన్నపాలెం, రాజీవ్‌నగర్ ప్రాంతానికి చెందిన బంకిళ సంతు(37) హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలతోపాటు కుటుంబానికి చెడ్డ పేరు తీసుకొస్తోందన్న అనుమానంతో ఆమెను ఇద్దరు కూతుళ్లు, మరిది హతమార్చినట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. తన కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కూర్మన్నపాలెం, దువ్వాడ, రాజీవ్‌నగర్‌కు చెందిన బంకిళ సంతు, ఇద్దరు కుమార్తెలు అనూష, మైనర్ కుమార్తె, మరిది మురళీధర్‌లు కలిసి ఉంటున్నారు. సంతు భర్త ఖతర్‌లో ఉద్యోగ రీత్యా ఉన్నాడు. సంతు కుటుంబలో ఆస్తి తగాదాలు, ఆర్థిక సమస్యలపై తరుచూ వివాదాలు పడుతున్నారు. భార్యాభర్తల మధ్య దాంపత్య బంధం సరిగా లేకపోవడంతో భర్త ఖతార్ వెళ్లిపోయాడన్న ఆరోపణలున్నాయి. గతంలో భర్తపై సంతు పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇద్దరు కూతుళ్లతోనూ కొంతకాలంగా గొడవలు పడుతోంది. గతంలో ఆస్తిని కూడా అమ్మకాలు చేశారు. ఈ విషయంపై కూర్మన్నపాలెం పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. ఆస్తి అమ్మగా వచ్చిన సొమ్మును సంతు దుర్వినియోగం చేసి, కుటుంబానికి చెడ్డపేరు తీసుకొస్తోందని ఇద్దరు కూతుళ్లు, మరిది కోపంతో ఉన్నారు. ఈ నెల 13న చిన్న కూతురు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చింది. తల్లికి చెందిన సెల్‌ఫోన్ చూడగా అసభ్యకరమైన ఫొటోలు, కాల్ రికార్డులు చూసి షాక్‌కు గురై అక్కడే ఉన్న అక్క అనూషకు తెలిపింది. కూతుళ్లు, మరిది కలిసి సంతును ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న సంతును ఈ నెల 13వ తేదీ అర్ధరాత్రి ఇద్దరు కూతుళ్లు, మరిది హత్య చేశారు. 14వ తేదీ తెల్లవారుజామున మురళీధర్ స్నేహితుడైన మోహన్ కారులో మృతదేహాన్ని దువ్వాడ మీదుగా సబ్బవరం మండలం వేట జంగాలపాలెం గ్రామానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. సెల్‌ఫోన్ డేటా ఆధారంగా సంతు హత్య కేసును ఛేదించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. సమావేశంలో పరవాడ సబ్ డివిజన్ డీఎస్పీ విష్ణుస్వరూప్, సబ్బవరం సీఐ రామచంద్రరావు, సీసీఎస్ సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐలు సింహాచలం, ప్రసాదరావు, రామకృష్ణ, రమేష్, స్టేషన్ సిబ్బంది శ్రీనివాసరావు, సతీష్ కుమార్, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.