
ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయం
సింహాచలం: ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాల ని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో గల వరాహ పుష్కరిణి వద్ద కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌లతో కలిసి మేయర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులను నివారించడానికి ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ వర్షాకాలంలో దోమల వ్యాప్తి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలంతా ‘మన ఆరోగ్యం–మన బాధ్యత’ అనే నినాదంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కాలువల్లో తాగునీటి పైపులైన్లు కలవడం వల్ల డయేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ ప్రజలు వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరు చేసి డస్ట్‌బిన్‌లలో వేసి జీవీఎంసీ వాహనానికి అందించాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణహితమైన మట్టి వినాయకుడి విగ్రహాలనే పూజించాలని కోరారు. అలాగే సింహాచలంలో బీఆర్‌టీఎస్ రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి త్వరలోనే టీడీఆర్‌లు జారీ చేస్తామని వెల్లడించారు. సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు మాట్లాడుతూ వరాహ పుష్కరిణిని అభివృద్ధి చేసేందుకు మేయర్, కలెక్టర్ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా దోమల నియంత్రణకు కోనేరులో గంబూషియా చేపలను విడుదల చేశారు. అనంతరం పలువురికి వినాయక మట్టిప్రతిమలను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా నేషనల్ సఫాయి కర్మచారి ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆర్థిక సాయంతో రూ.37లక్షలతో కొనుగోలు చేసిన జేసీబీ, రెండు చైన్ మౌంటెడ్ మిషన్ జేఎస్ 81 వాహనాలను సబ్సిడీపై లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి. రమణమూర్తి పాల్గొన్నారు.