
ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యాక్టు అమలు చెయ్యాలి
సీతంపేట: మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యాక్టు 1961 నిబంధనలను సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం యజమాన్యాలు కచ్చితంగా పాటించాలని జాయింట్ లేబర్ కమిషనర్ ఎం. రామారావు స్పష్టం చేశారు. శనివారం అక్కయ్యపాలెంలోని సంస్థ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైవర్ల పనిగంటలు, విశ్రాంతి వ్యవధి విషయంలో ఎలాంటి సడలింపులు ఉండబోవని తెలిపారు. జిల్లా ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ జయప్రకాశ్ మాట్లాడుతూ ప్రతి 350 కిలోమీటర్ల డ్రైవింగ్ తర్వాత డ్రైవర్లకు తప్పనిసరిగా విశ్రాంతి ఇవ్వాలని సూచించారు. గతంలో కొన్ని సడలింపులు ఇచ్చినా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇకపై వీటిని కఠినంగా అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంటీఎబ్ల్యూ–ఐసీబీ–ఏపీ–జీవోవీ.ఐఎన్ వెబ్‌పోర్టల్‌లో వాహనాలు, డ్రైవర్లు, క్లీనర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లోవకుమార్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసే విధానాన్ని వివరించారు. మరో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శైలేష్ కుమార్ సర్కిల్–4 ఇండివిడ్యువల్ కంట్రోల్ బుక్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించే విధానాన్ని, అలాగే మాన్యువల్ రికార్డుల నిర్వహణను వివరించారు.
26న రాజ్‌నాథ్ సింగ్ రాక
మహారాణిపేట: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈనెల 26న విశాఖ వస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు.