
5 నుంచి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్
మహారాణిపేట: నగర ప్రజలకు, పర్యాటకుల కోసం సెప్టెంబర్ 5 నుంచి 7 వరకు బీచ్ రోడ్డులోని ఎంజీఎం గ్రౌండ్స్‌లో ‘వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్’నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ వీసీ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మూడు రోజుల ఫెస్టివల్‌లో ఉత్తరాంధ్ర సంప్రదాయ రుచులతో పాటు, దేశ విదేశాల వంటకాలతో దాదాపు 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమని, ప్రజలను అలరించడానికి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. సన్ స్కూల్ ఆధ్వర్యంలో చెఫ్‌లకు పోటీలు నిర్వహిస్తామన్నారు. నగరంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు యుహెచ్2హెచ్ హెలికాప్టర్ మ్యూజియం, యాత్రి నివాస్ వంటివి అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలో డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్‌ను టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ జగదీష్, జిల్లా టూరిజం అధికారిణి మాధవిలతో కలసి కలెక్టర్ ఆవిష్కరించారు