ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు

Aug 21 2025 7:26 AM | Updated on Aug 21 2025 7:26 AM

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు

ఎట్టకేలకు డిగ్రీ అడ్మిషన్లు

ఏయూ పరిధిలో

196 కాలేజీలకు గుర్తింపు

ఆన్‌లైన్‌లో నమోదుకు

ఈ నెల 25 వరకు గడువు

ఈ ఏడాది కాలేజీలపై తనిఖీలు నిల్‌

అనుమతుల్లేకున్నా అడ్డగోలుగా ప్రవేశాలు కల్పిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు

అకాడమీల పేరుతో కాలేజీల నిర్వహణ

చోద్యం చూస్తోన్న ఆంధ్ర యూనివర్సిటీ పాలకులు

విశాఖ విద్య : డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు ఎట్టకేలకు బుధవారం ప్రారంభమయ్యాయి. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో చేరేందుకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యామండలి షెడ్యూల్‌ ప్రకటించడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కాలేజీలకు క్యూ కట్టారు. కాలేజీల్లో అందుబాటులో ఉన్న కోర్సులపై ఆరా తీసి, అనంతరం మీ సేవా కేంద్రాలు, నెట్‌ సెంటర్లకు వెళ్లి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఉన్నత విద్యా మండలి ఇచ్చిన షెడ్యూల్‌ మేరకు ఈ నెల 25 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్‌ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో చేరవచ్చు.

ఉమ్మడి జిల్లాలో 196 డిగ్రీ కాలేజీలు

ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్‌తో ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలో 196 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఏటా డిగ్రీ మొదటి సంవత్సరంలో 25 వేల మందికి పైగానే విద్యార్థులు చేరుతుంటారు. ఈ కాలేజీల నిర్వహణకు ఏటా ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేషన్‌ (గుర్తింపు) ఇస్తోంది. ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌ ప్రవేశాల వెబ్‌సైట్‌లో వర్సిటీ అఫిలియేషన్‌ పొందిన కాలేజీల జాబితానే పెడతారు.

తనిఖీలు లేకుండానే కాలేజీలకు గ్రీన్‌ సిగ్నల్‌

విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఏటా డిగ్రీ కాలేజీల్లో తనిఖీలు జరిగేవి. కాలేజీల నిర్వహణకు అనువైన భవనాలు, తరగతి గదులు, అర్హత గల అధ్యాపకులు, ఆట స్థలం, లైబ్రరీ, సైన్స్‌ ప్రయోగశాలలు, పార్కింగ్‌ ప్రదేశం ఉండాలి. పోలీసు, జీవీఎంసీ, అగ్నిమాపక శాఖల నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందాలి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో సవ్యంగా ఉన్నాయా..? లేదా.? అనేది వర్సిటీ నుంచి వెళ్లే టీమ్‌ తనిఖీ చేసి, నిజనిర్థారణ నివేదిక ఇచ్చిన తర్వాతే అఫిలియేషన్‌ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వర్సిటీలోని కాలేజీ డెవలప్‌మెంట్‌ కమిటీ (సీడీసీ) పర్యవేక్షిస్తోంది. అయితే ఈ ఏడాది తనిఖీలు లేకుండానే ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ప్రైవేటు కాలేజీలకు మేలు చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.

అనుమతుల్లేకున్నా దర్జాగా అడ్మిషన్లు

విశాఖ జిల్లాలోని మధురవాడలో అకాడమీ పేరుతో విద్యాలయాన్ని నిర్వహిస్తున్న ఓ సంస్థ వర్సిటీ గుర్తింపు లేకున్నా, బీబీఏ, బీసీఏ, ఇతర డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు చేపడుతున్నారు. ఇక్కడ చేర్చుకునే విద్యార్థులను ద్వారాకా నగర్‌లోని ఓ కాలేజీలో పేర్లు నమోదు చేసి, మధురవాడలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఇదేమీ తెలియకుండానే, అక్కడ చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఏయూ పరిధిలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో పలు ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సరైన వసతులు లేవు. అర్హత గల ఫ్యాకల్టీ లేరు. ఇలాంటి కాలేజీల్లో చదువులు సవ్యంగా సాగుతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ పాలకులు ఇలాంటి వాటిపై తమకేమీ సంబంధం లేనట్లుగా చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ప్రైవేటులో అడ్మిషన్ల దందా

ఇంటర్మీడియట్‌ ఫలితాలు ప్రకటించి ఇప్పటికే నాలుగు నెలలు అవుతుంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీల యాజమాన్యాల వారు ఇప్పటికే ఇంటర్‌ పాసైన విద్యార్థులకు గాలం వేసి, వారికి సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు సేకరించి, తమ కాలేజీలోనే చేరేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే కాలేజీల నిర్వహణను ఉన్నత విద్యామండలి పర్యవేక్షిస్తుండగా ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా వాటికి అఫిలియేషన్‌ ఇవ్వడంతోపాటు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరి మధ్య సమన్వయ లోపంతో ప్రైవేటు కాలేజీలపై పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ల దందా కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement