
చాంపియన్ సైనికుడు ఎర్రయ్యరెడ్డి మృతి
తగరపువలస: భీమిలి మండలం రేఖవానిపాలెం పంచాయతీ మరడపాలేనికి చెందిన చాంపియన్ సైనికుడు చిల్ల ఎర్రయ్యరెడ్డి(56) అలియాస్ ఆంబిరెడ్డి బుధవారం మృతి చెందారు. స్వతహాగా కబడ్డీ క్రీడాకారుడైన ఎర్రయ్యరెడ్డి ఆర్మీలో చేరిన తరువాత అదే క్రీడతో తాను విధులు నిర్వర్తిస్తున్న ఏఎన్‌సీ గయ(బీహార్) యూనిట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు సార్లు జట్టును మొదటి స్థానంలో నిలిపారు. విధుల్లో ఉండగానే 2001లో ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి జారిపడి వెన్నుపూస విరిగింది. పూణెలోని ఆర్మీ పునరావాస కేంద్రంలో ఉంటూ కొత్త జీవితం ప్రారంభించాడు. మిలిటరీ ఆస్పత్రిలో రెండేళ్ల చికిత్స అనంతరం వీల్ చైర్‌లో ఉంటూనే షార్ట్‌పుట్, హ్యాండ్‌బాల్, జావలిన్ త్రో, బాస్కెట్‌బాల్, డిస్క్ త్రో వంటి తనకు అనువైన క్రీడల్లో సాధన చేసి వందలాది పతకాలు, లెక్కలేనన్ని సన్మానాలు పొందారు. దక్షిణ కొరియా, మలేషియా, రష్యా వంటి దేశాల్లో జరిగిన పారా సైనికుల క్రీడల్లో పాల్గొన్నారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. గురువారం మరడపాలెంలో ఎర్రయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

చాంపియన్ సైనికుడు ఎర్రయ్యరెడ్డి మృతి