
అడ్డగోలుగా జీవీఎంసీ లీగల్ సెల్
హైకోర్టులో రూల్ ఆఫ్ రిజర్వేషన్
అంశం పెండింగ్
అయినా స్టాండింగ్ కౌన్సిల్‌కు
నోటిఫికేషన్
కౌన్సిల్ సమావేశం అజెండాలో
51వ అంశంగా చర్చకు పిలుపు
ఆ నోటిఫికేషన్ చెల్లదన్న సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ
డాబాగార్డెన్స్ : జీవీఎంసీలో అనేక తప్పిదాలు జరుగుతున్నాయని సీనియర్ న్యాయవాది పాక సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు బుధవారం వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టాండింగ్ కౌన్సిల్‌కు సంబంధించి గత ఏడాది డిసెంబర్ 12న 9241/2007 పేరిట జీవీఎంసీ నోటిఫికేషన్ జారీ చేసినట్టు తెలిపారు. ఆ నోటిఫికేషన్‌లో గ్రాస్ పాయింట్‌ను ఎక్కడా చూపకుండా కేవలం ఓసీ, బీసీ – ఏ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్‌ను మాత్రమే చూపిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారని, ఎక్కడా ఎస్సీ కేటగిరీని చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జారీ చేసిన నోటిఫికేషన్ నెంబర్‌తోనే మరలా జారీ చేశారని, ఆ వివరాలు పరిశీలించాలన్నారు. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌కు, ప్రస్తుత నోటిఫికేషన్‌కు పొంతన లేదని, ఇలా ఎందుకు జరుగుతుందో అధికారులే వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎస్సీలకు జీవించే అధికారం, హక్కులు లేవా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని హరించేలా జీవీఎంసీ వ్యవహరిస్తోందని, తనకు రిజర్వేషన్ ఉందని, కానీ అవకాశం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. గతేడాది విడుదల చేసిన నోటిఫికేషన్ ఎట్టి పరిస్థితిలోనూ చెల్లదని స్పష్టం చేశారు. ఈ విషయమై తాను ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించానని, అవేవీ పట్టించుకోకుండా లీగల్ సెల్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయడమంటే కోర్టును ఉల్లంఘించినట్టేనని చెప్పారు. నోటిఫికేషన్ సరిదిద్దకపోయినా, అదనపు అఫిడవిట్‌తో రద్దు చేయకపోయినా తాను మళ్లీ కోర్టుకు వెళ్తానని సత్యనారాయణ హెచ్చరించారు. ఓపెన్ కేటగిరీలో మహిళా రిజర్వేషన్ చూపించకపోవడమంటే మహిళలకు అన్యాయం చేస్తున్నట్టేనని, రాజ్యాంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉన్నా, దానిని అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. 10 శాతం ఉన్న వీకర్ సెక్షన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌లో అవకాశం కల్పిస్తే, 15 శాతం ఉన్న ఎస్సీలకు ఎందుకు అవకాశం కల్పించలేదో చెప్పాలన్నారు. కమిషనర్ తక్షణమే దృష్టి సారించి, నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉంటుండగా, కౌన్సిల్ సమావేశంలో చర్చకు ఎలా పెడతారని ప్రశ్నించారు.