అల్లిపురం: వాస్తవ పరిస్థితులను ఎప్పటికీ గుర్తుచేసే శక్తి ఫొటోగ్రఫీకి ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు ఆర్కే రోజా అన్నారు. 186వ ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైజాగ్ ఫొటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో బీచ్ రోడ్‌లోని విశాఖ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె సందర్శించారు. వైజాగ్ ఫొటో జర్నలిస్టులు తీసిన చిత్రాలు, అవార్డులు పొందిన ఫొటోలను ఆమె తిలకించి ప్రశంసించారు. ఒక ఫొటో ద్వారానే వాస్తవ పరిస్థితిని ప్రజలకు తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ ఏటా నిర్విరామంగా ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్న వైజాగ్ ఫొటో జర్నలిస్టులను అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తైనాల విజయకుమార్, గాజువాక వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫొటోగ్రఫీ గొప్పతనంపై ఆర్కే రోజా ప్రశంసలు