
టెర్రస్ పైనుంచి జారిపడి విద్యార్థిని మృతి
తాటిచెట్లపాలెం: ఇంటి టెర్రస్ మీది నుంచి ప్రమాదవశాత్తు జారిపడి విద్యార్థిని మృతిచెందింది. ఫోర్త్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. రైల్వేన్యూకాలనీలోని శివసాయి ఎన్‌క్లేవ్‌లో రైల్వే లోకో పైలట్ వురిటి శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఇతని పెద్ద కుమార్తె వర్షిత(19) గీతం కళాశాలలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. బుధవారం ఉదయం కాలేజికి వెళ్లిన ఆమె, రికార్డుల కోసం ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం ఉతికిన బట్టలు తీసుకురావడానికి అపార్ట్‌మెంట్ టెర్రస్ పైకి వెళ్లింది. నేలపై నాచు ఉండడంతో బట్టలు తీస్తున్న సమయంలో దానిపై కాలు వేసిన వర్షిత జారిపోయి కిందికి పడిపోయింది. వాచ్‌మన్ ద్వారా విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించగా.. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి చెప్పిన వివరాల మేరకు ఫోర్త్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.