
కేంద్రాన్ని మొండిగా సమర్థిస్తున్న కూటమి
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై సీపీఎం ఆందోళన
డాబాగార్డెన్స్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను వేగవంతం చేసిందని, రాష్ట్ర కూటమి ప్రభుత్వం దీనికి సహకరించడం దారుణమని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింగరావు అన్నారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను 34 విభాగాలుగా విభజించి, వాటి నిర్వహణ, ఆపరేషన్ పనులను కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు కేంద్రం టెండర్లు పిలిచిందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల వేలాది మంది శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ప్రైవేటీకరణ వల్ల గాజువాక ప్రాంతం ఎడారిగా మారుతుందన్నారు. 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించడం అన్యాయమని ఆక్షేపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలను నరసింగరావు ఖండించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని కార్మికులకు నైపుణ్యం లేదని శ్రీనివాసరావు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా తోసిపుచ్చారు. దేశంలోనే అత్యంత ఆధునీకరించబడిన ప్లాంట్ విశాఖ స్టీల్ అని, ఇక్కడ పనిచేసే కార్మికులు అత్యంత నైపుణ్యం కలవారని ఆయన సవాల్ చేశారు. దేశంలోని ఇతర స్టీల్‌ప్లాంట్లకు సొంత గనులు ఉన్నప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కుట్ర వెనుక ఆర్సీలార్ మిట్టల్ వంటి సంస్థలకు ప్లాంట్‌ను అప్పగించే ప్రయత్నం జరుగుతోందని, ప్రజలంతా ఏకమై స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలని నరసింగరావు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఆర్కేఎస్వీ కుమార్, ఎస్. జ్యోతీశ్వరరావు, యు. రామస్వామి తదితరులు పాల్గొన్నారు.