
చోరీకి పాల్పడ్డ మహిళ అరెస్ట్
ఎంవీపీ కాలనీ: లాసన్స్ బే కాలనీలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన పద్మ అనే మహిళను ఎంవీపీ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్‌లో క్రైమ్ సీఐ చక్రధరరావు బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు. లాసన్స్‌బే కాలనీలో జి.వీరవెంకట సత్యనారాయణ వర్మ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నారు. వృద్ధురాలైన ఆయన తల్లి పైఅంతస్తులో ఒంటరిగా ఉంటోంది. గుర్తుతెలియని మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కంట్లో కారం కొట్టి చేతికి ఉన్న రెండు బంగారు గాజులను దొంగిలించింది. వృద్ధురాలు విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి బయట ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించడాన్ని గుర్తించారు. దాని ఆధారంగా విచారణ జరపగా గతంలో ఆ వృద్ధురాలికి కేర్ టేకర్‌గా ఓ పనిచేసిందని, ఆమెకు ఎరుపు రంగు స్కూటీ ఉందని తెలిసింది. దొంగతనానికి పాల్పడిన మహిళ కూడా ఎరుపురంగు స్కూటీలో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌లో గమనించారు. ఆ దిశగా విచారణ చేయగా శివాజీపాలెం ప్రాంతానికి ఆమె వెళ్లినటు్‌ల్ గుర్తించి, ఆమె ఇంటికి వెళ్లి తమదైన శైలిలో విచారణ జరపగా ఆమె నేరాన్ని అంగీకరించింది. బంగారు గాజుల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.