
గంజాయి రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
అల్లిపురం : ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈగల్ ఐసీపీ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్‌ను ప్రారంభించిందని ఐసీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. హోటల్ నోవాటెల్‌లో జరిగిన పొగాకు నియంత్రణపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘గేట్‌వే సిద్ధాంతం’ ప్రకారం పొగాకు వంటి చిన్నపాటి అలవాట్లు డ్రగ్స్‌కు దారి తీస్తాయని ఆయన చెప్పారు. ఈ సమస్యను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 60,000 విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ క్లబ్‌లలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు గంజాయి, డ్రగ్స్ వంటి వాటి గురించి సమాచారం ఉంటే టోల్–ఫ్రీ నంబర్ 1972కు తెలియజేస్తారు. అలాగే కోట్పా యాక్ట్ 2003 ప్రకారం విద్యాసంస్థల పరిసరాల్లో 100 గజాల వరకు పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు నిషేధించామని పేర్కొన్నారు. సమావేశంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్ బాబు ,కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రజారోగ్య నిపుణులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.