
ఇల బృందావనం
సీతంపేట/ఎంవీపీకాలనీ/తరగపువలస/ కొమ్మాది: నగరంలో కృష్ణాష్టమి వేడుకలు శనివారం కనులపండువగా జరిగాయి. సంస్కారభారతి ఆధ్వర్యంలో ద్వారకానగర్ శ్రీకృష్ణ విద్యామందిర్ ప్రాంగణం గోకుల బృందావనాన్ని తలపించింది. ‘బాలగోకులం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముద్దులొలికే చిన్ని కృష్ణులు, రాధలు, గోపికల వేషధారణలో సుమారు 170 మంది చిన్నారులు పాల్గొన్నారు. నెలల పసికందుల నుంచి ఎనిమిదేళ్ల బాలల వరకు.. బుడి బుడి అడుగులతో, చిలిపి నవ్వులతో నడిచొచ్చిన ఆ బాలగోపాలురను చూసి ఆహూతులు మురిసిపోయారు. బలరామకృష్ణులుగా, రాధాకృష్ణులుగా చిన్నారులు చేసిన సందడితో ఆ ప్రాంగణమంతా నందనవనంగా మారింది. ఉట్టి కొట్టే ఉత్సవంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, శ్రీకృష్ణుని లీలలను స్మరణకు తెచ్చారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ విద్యా మందిర్ హైస్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన ‘శ్రీకృష్ణుని లీలలు’ఘట్టాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుని జననం నుంచి కంసవధ వరకు సాగిన ముఖ్య ఘట్టాలను(రోలుకు కట్టడం, కుబేర పుత్రుల శాప విమోచనం, ఇంద్రోత్సవం, గోవర్ధన గిరి ధారణ, కాళీయ మర్దనం, కంసవధ) కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి, వాటి అంతరార్థాలను, ఆధ్యాత్మిక విశేషాలను సందర్శకులకు వివరించారు.

ఇల బృందావనం

ఇల బృందావనం

ఇల బృందావనం