
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి
కలెక్టర్ ఎంఎన్ హరేందిర ప్రసాద్
డాబాగార్డెన్స్: భావితర పౌరులందరూ సర్దార్ గౌతు లచ్చన్న జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, దేశాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా.. శనివారం నగరంలోని జడ్జి కోర్టు సమీపంలోని ఆయన విగ్రహానికి పలువురు బీసీ నేతలు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌తో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 35 ఏళ్ల పాటు లచ్చన్న శాసనసభ్యుడిగా పనిచేసి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి, ప్రజల కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. లచ్చన్న కుటుంబ సభ్యులు, యార్లగడ్డ వెంకన్న చౌదరి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామారావు, ప్రొఫెసర్ వివేకానందమూర్తి, కేశాని వెంకటేశ్వరరావు, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు గుత్తుల మధుసూదనరావు, బమ్మిడి రమణ, పితాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.