
స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లో భారీ చోరీ
ఉక్కునగరం: స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లోని ఓ క్వార్టర్‌లో పట్టపగలు భారీ దొంగతనం జరిగింది. హెచ్‌ఆర్ అధికారి ఎన్. సుందరం కుటుంబం బయటకు వెళ్లిన గంటన్నరలోనే ఈ చోరీ జరిగినట్లు క్రైమ్ పోలీసులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సుందరం దంపతులు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి ముందు తలుపు గడియ విరిగి ఉంది. లోపల బీరువా కూడా పగలగొట్టి ఉంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్రైమ్ పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగలు బీరువాలో ఉన్న 24 తులాల బంగారు ఆభరణాలను తీసుకెళ్లగా, అదే బీరువాలో ఉన్న మరో 40 తులాల బంగారాన్ని వదిలేయడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
సీసీ కెమెరాలపై ఏర్పాటు చేసుకోండి
చోరీల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ, స్టీల్‌ప్లాంట్ టౌన్‌షిప్‌లో ఎవరూ వాటిని ఏర్పాటు చేసుకోవడం లేదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనం జరిగిన తర్వాత బాధపడటం కన్నా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని సీఐ శ్రీనివాసరావు అన్నారు.